హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ బస్సులో బయలు దేరారు. కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎల్బీ స్టేడియంకు ఆర్టీసీ బస్సులో ప్రజలతో బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత బస్సు స్టార్ట్ కావడానికి మోరాయించడంతో, ఆ ఆర్టీసీ బస్సు దిగి మరో ఆర్టీసీ బస్సులో సభకు బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఎల్బీ స్టేడియం చుట్టూ పోలీస్ సిబ్బందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసు శాఖ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 50వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో హాజరకానునున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సభ జరగనుంది. కోవిడ్ నిబంధనల మధ్య సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని డివిజన్ల నుంచి భారీగా జన సమీకరణ జరుగుతోంది. ఎల్బీ స్టేడియం మొత్తం గులాబీమయమైంది.
ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. రాత్రి 8గంటల వరకు ఎల్బీస్టేడియం వద్ద వాహన రాకపోకలకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సభలో సిఎం కేసీఆర్ ఆరేళ్లుగా హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు.