అమరావతి: మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కోవిడ్ – 19 నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ లో కరోనా పరీక్షల సంఖ్య 1 కోటి దాటింది. ఈ రోజు వరకు రాష్ట్రంలో ఏకంగా 1,00,57,854 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
కాగా ఏపీ లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా, 381 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 868064 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 934 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,53,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం, చిత్తూరు, కృష్ణా,విశాఖపట్నంలో ఒక్కరి చొప్పున మొత్తం నలుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6992కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 7,840 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.