fbpx
Thursday, January 2, 2025
HomeBusinessఆర్‌బీఐ నుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాక్‌

ఆర్‌బీఐ నుండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాక్‌

RBI-SHOCKS-HDFC-BANK-ON-DIGITAL-CREDITCARDS

సాక్షి: కార్పొరేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ షాకిచ్చింది. ఆన్‌లైన్‌ సర్వీసులలో అంతరాయాల నేపథ్యంలో డిజిటల్‌, క్రెడిట్‌ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆదేశించింది. గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సమస్యకు తొలుత పరిష్కారాన్ని వెదకమంటూ ఆదేశించినట్లు తెలిసింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్‌-2లో భాగంగా ‌ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్‌ సంబంధ కార్యక్రమాలనూ తాత్కాలికంగా నిలిపివేయవలసిందిగా ఆర్‌బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. వీటిలో భాగంగా కొత్తగా క్రెడిట్‌ కార్డుల జారీని సైతం నిలిపివేయవలసి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు తెలియజేశాయి.

లోపాలను సవరించిన వెంటనే ఆర్‌బీఐ విధించిన తాజా ఆంక్షలను ఎత్తి వేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలు బ్యాంకు రోజువారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావమూ చూపవని ప్రకటించింది. ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలూ యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్‌ ప్రసారంలో వైఫల్యాలు సర్వీసులలో అంతరాయాలకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

గత నెల 21న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిజిటల్‌, ఆన్‌లైన్‌‌ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడటంతో ఆర్‌బీఐ వివరాలు దాఖలు చేయమంటూ ఆదేశించింది. గతేడాది డిసెంబర్‌లో తలెత్తిన అంతరాయం కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు తొలిసారి రెండు రోజులపాటు మొబైల్‌ బ్యాంకింగ్‌, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను పొందలేకపోయారు. అయితే ప్రస్తుత క్రెడిట్‌ కార్డుల వినియోగదారుల సేవలు, డిజిటల్‌ బ్యాంకింగ్ తదితర సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular