ముంబై: రెండో నెలలోనూ వరుసగా వినియోగదారులను జత చేసుకోవడంలో మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ముందంజలో ఉంది. సెప్టెంబర్లో 3.8 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందింది. ఈ బాటలో రిలయన్స్ జియో 1.5 మిలియన్లమంది వినియోగదారులను కొత్తగా సంపాదించింది.
రిలయన్స్ జియోతో పోలిస్తే సెప్టెంబర్లో ఎయిర్టెల్ రెట్టింపునకుపైగా యూజర్లను ఆకట్టుకుంది. వెరసి కొత్తగా కస్టమర్లను పొందడంలో వరుసగా రెండో నెలలోనూ జియోను మించి ఎయిర్టెల్ ముందుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎయిర్టెల్. కాగా, ఇటీవల పోటీలో వెనుకబడుతున్న వొడాఫోన్ ఐడియా మరోసారి వినియోగదారులను కోల్పోవడం జరిగింది!
సెప్టెంబర్ చివరికల్లా రిలయన్స్ రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.36 శాతం పుంజుకుని 40.41 కోట్లను తాకింది. ఇక ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 1.17 శాతం వృద్ధితో 32.66 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా 4.7 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోవడం ద్వారా 29.55 కోట్ల సంఖ్యకు పరిమితమైంది. దీంతో 35.1 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలవగా, 28.4 శాతం వాటాతో ఎయిర్టెల్ రెండో ర్యాంకును పొందింది. వొడాఫోన్ ఐడియా 25.7 శాతం మార్కెట్ వాటాతో తదుపరి స్థానాన్ని కైవసం చేసుకుంది.