fbpx
Sunday, October 27, 2024
HomeSportsఆసీస్ 'ఎ 'పై సెంచరీ చేసిన రిషబ్, విహారి

ఆసీస్ ‘ఎ ‘పై సెంచరీ చేసిన రిషబ్, విహారి

RISHABH-VIHARI-MADE-CENTURIES-ON-AUSTRALIA-A

సిడ్నీ: ఆసీస్ ‘ఎ ‘ తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొదట్లో తడబడిన భారత బ్యాట్స్‌మెన్‌ త్వరగానే తమ ఆటను దారిలో పెట్టుకున్నారు. మ్యాచ్‌ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగులు భారీ స్కోరును నమోదు చేసింది.

ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి (194 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 13 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (73 బంతుల్లో 103 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో ఊపు మీదున్నారు. శుబ్‌మన్‌ గిల్‌ (78 బంతుల్లో 65; 10 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌ (120 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అధ్బుత బ్యాటింగ్ తో అర్ధ సెంచరీలు సాధించారు.

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లోని 86 పరుగులు కలిపి ఓవరాల్‌ ఆధిక్యం 472 పరుగులకు చేరింది. రెండో రోజు మధ్యలో కొద్దిసేపు వర్షం అంతరాయం కలిగించినా, ఇబ్బంది లేకుండా మొత్తం 90 ఓవర్ల ఆట సాగింది. మ్యాచ్ లో నేడు మ్యాచ్‌కు ఆఖరి రోజు. చక్కటి బ్యాటింగ్‌ పిచ్‌పై కనీసం నిలబడే ప్రయత్నం చేయకుండా పృథ్వీ షా (3) పేలవ షాట్‌ ఆడి ఆరంభంలోనే నిష్క్రమించాడు. ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టు అవకాశాలు దూరం చేయవచ్చని భావిస్తున్నారు.

ఓపెనర్‌ స్థానం కోసం షాతో పోటీ పడుతున్న గిల్‌ మాత్రం మరోసారి సాధికారిక ఆటతీరు కనబర్చాడు. చూడచక్కటి కవర్‌డ్రైవ్‌లు, పుల్‌ షాట్లతో పాటు బ్యాక్‌ఫుట్‌పై పూర్తి నియంత్రణతో అతను ఆడిన తీరు సరైన టెస్టు బ్యాట్స్‌మన్‌ను చూపించాయి.

మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన హనుమ విహారి రెండో ఇన్నింగ్స్‌ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో గులాబీ బంతి కొంత ఇబ్బంది పెడుతున్న సమయంలో అతను చక్కటి ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేశాడు. అందమైన ఆన్‌ డ్రైవ్‌లు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. 98 బంతుల్లో విహారి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విహారి 62 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనితో పంత్‌ జత కలిసిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది.

హనుమ విహారి, రిషబ్‌ 147 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యంలో (22.4 ఓవర్లలో) విహారి స్కోరు 42 పరుగులు మాత్రమే కాగా పంత్‌ సెంచరీతో చెలరేగడం విశేషం. ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడ్డ పంత్‌ 43 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు విల్డర్‌ముత్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో 188 బంతుల్లో విహారి శతకం పూర్తయింది. అయితే రెండో రోజు చివరి ఓవర్‌కు ముందు ఓవర్‌ ఆఖరి బంతికి సదర్‌లాండ్‌ క్యాచ్‌ వదిలేయడంతో పంత్ కు లైఫ్ లభించింది.

విజయానికి సరిపడా స్కోరు సాధించినా భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయలేదు. మన బ్యాట్స్‌మెన్‌కు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రెండో రోజు మంచి ప్రాక్టీస్‌ లభించింది. అయితే బౌలర్లు మాత్రం డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ కోసం మరింత సాధన కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ‘ఎ’ 32.2 ఓవర్లకే కుప్పకూలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular