fbpx
Thursday, December 26, 2024
HomeTelanganaహైదరాబాద్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

హైదరాబాద్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?

HYDERABAD-CONGRESS-SITUATION-WORSEN-GHMC-ELECTIONS

హైదరాబాద్: తెలంగాణ హైదరాబాద్‌ సిటీ కాంగ్రెస్‌కు చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇటివల జరిగిన పలు ఎన్నికలలో వరుస ఓటములతో దెబ్బపై దెబ్బ పడుతోంది. పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే పార్టీలో ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలకు క్యూ కడుతుండగా, తాజాగా అంజన్‌కుమార్‌ యాదవ్‌ తన పదవికి రాజీనామా చేయడంతో నగర అధ్యక్ష పీఠం కూడా ఖాళీ అయింది.

పీసీసీ ప్రమోషన్‌ కోసమే పదవికి రాజీనామా చేశానని అంజన్‌కుమార్‌ పేర్కొంటున్నా, జీహెచ్‌ఎంసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయనను పక్కన పెట్టడమే అసలు కారణంగా తెలుస్తోంది. మరోవైపు యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శిగా ఉన్న ఆయన కుమారుడు అనిల్‌ కుమార్‌కు సైతం సరైన ప్రాధాన్యం ఇవ్వక పోవడం లాంటి రాజకీయ పరిస్థితులు రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది.

గత ఆరేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ లో సంస్థాగతంగా బలహీనపడి పరిస్థితి నిర్వీర్యం అయ్యింది. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకాగా, అప్పట్లో గ్రేటర్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరిపోయారు. ఇక గత రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభా ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది.

ఇక ఈ నెలలో జరిగిన నగర కాంగ్రెస్‌ పార్టీలో బల్దియా ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపాయి. మాజీ మేయర్‌ కార్తీక రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్, మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పగా, పాతబస్తీ మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

ఇంకోవైపు అగ్రనేతలైన గూడురు నారాయణరెడ్డి, విజయశాంతి తదితరులు కూడా వేరే పార్టీల్లోకి వలస వెళ్ళారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి అధికార పక్షం ముందు కాంగ్రెస్‌ ఏ మాత్రం నిలవలేకపోయింది. తాజా రాజకీయ పరిణామాలతో ప్రదేశ్‌ కాంగ్రెస్‌తో పాటు నగర కాంగ్రెస్‌ రథసారథులు సైతం పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular