దుబాయ్ : 2020 ఏడాది ముగుస్తున్న వేళ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ రోజు విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్‌రౌండ్ ఇలా అన్ని విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లు చోటు దక్కించుకొని తమ సత్తా చాటారు.
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు, టెస్ట్ స్పెషలిస్ట్ అయిన చతేశ్వర్ పుజారా 766 పాయింట్లతో ఏడవ స్థానం, రహానే 726 పాయింట్లతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో టాప్-10 లో ముగ్గురు భారత ఆటగాళ్ళు స్థానం దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో బ్యాటింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ లో నిలిచాడు.
బౌలింగ్ విభాగానికి వస్తే ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 904 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, టీమిండియా నుంచి బుమ్రా 779 పాయింట్లతో 8వ స్థానం, 756 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ 10వ స్థానంలో నిలిచారు. ఆల్‌రౌండ్ విభాగంలో జడేజా 397 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, 281 పాయింట్లతో అశ్విన్ 6వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 446 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం.