న్యూఢిల్లీ: జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన ఫలాలను త్వరగా ప్రజలకు అందేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణంలో ఆలస్యం జరిగే కొద్ది ఖర్చు పెరిగిపోతుందని తెలిపారు.
ఇప్పటికే సవరించిన అంచనా ఖర్చుల మేరకు ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సీఎం అమిత్ షాకు వినతిపత్రం అందచేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ రాత్రి 8.35 నుంచి 9.40 గంటల వరకు అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్‌సీఈ) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే రూ.55,656 కోట్ల వ్యయాన్ని ఆమోదించాలని, ఈ మేరకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలకు సూచించాలని ముఖ్యమంత్రి కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనుల ఖర్చును రీయింబర్స్ చేయాలని కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.
కోవిడ్ సమయంలో వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూనే జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సమతుల్యత పాటిస్తూ ముందుకుసాగామన్నారు. వివిధ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న తీరును వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయడానికి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, అత్యంత కీలకమైన కోల్డ్‌చైన్ల ఏర్పాటు చేసి సమాయత్తంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోంమంత్రిని కోరారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.