అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్వో డాక్టర్ సునంద, డీసీహెచ్మో డాక్టర్ ఏవీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అస్వస్థతకు కారణాలపై శాస్త్రవేత్తలతో చర్చించారు. పురుగు మందుల అవశేషాలే ఈ పరిస్థితికి కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు తెలిపాయి. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యయన బాధ్యతల్ని న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి అప్పగించారు.
ఈ సందర్భంగా ఏ కారణాన్ని కొట్టి పారయేకుండా వీలైనంత మేర పరీక్షలు చేయించాలి. అప్పుడే ఏలూరు లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చూడగలం. డంపింగ్ యార్డులు నిర్వహణపై కూడా దృష్టి పెట్టలన్నారు. ఏలూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా అలాంటి పరీక్షలు చేయించాలి. అలాగే తాగు నీటి వనరులన్నింటినీ అన్ని జిల్లాల్లో పరిశీలన చేయండి. ఒక పద్దతి ప్రకారం శాంపిల్స్ తీసుకుని, వాటిని నిపుణులచేత విశ్లేషణ చేయించాలి.
వాటన్నింటినీ లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్, ఐఐసీటీ కార్యాచరణలోకి దిగి ఏలూరు ఘటనలకు దారి తీసిన పరిస్థితులపై నిరంతర పరిశీలన చేయాలి. దానికి కార్యాచరణ తయారు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం. ఇంకా అందు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, మార్గాలను ఖరారు చేయాలని నిర్దేశం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతులకు దీనిపై అవగాహన కల్పించాలి.