న్యూయార్క్: ప్రపంచ కుబేరుల జాబితాలో 18వ ర్యాంకులో ఉన్న మెకంజీ స్కాట్ గడచిన నాలుగు నెలల్లో దాదాపు 400 కోట్ల డాలర్ల(అంటే సుమారు రూ. 29,400 కోట్లు)ను దానం చేశారు. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌కు మాజీ భార్య మెకంజీ స్కాట్.
కరోన వైరస్ బాధితులను ఆదుకునేందుకు ప్రధానంగా ఆమె ఈ వితరణను చేపట్టారు. కోవిడ్-19 ధాటికి యూఎస్‌లో ఆరోగ్యం, ఆహారం, ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయంగా 384 ఆర్గనైజేషన్స్‌కు నిధులు అందించినట్లు స్కాట్ ఇటీవల వెల్లడించారు. ఫుడ్ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్స్‌కు 4.1 బిలియన్ డాలర్లను అందించినట్లు ఒక బ్లాగు ద్వారా ఆమె పేర్కొన్నారు.
దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి, ఉపాధి శిక్షణ, న్యాయ సంరరక్షణ లాంటి ఇతర ఖర్చులకు సైతం ఆమె కొంతమేర నిధులను ఇచ్చినట్లు తెలియజేశారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం తదితరాలకు మద్దతుగా జులైలో 1.7 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లు స్కాట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జెఫ్ బెజోస్ నుంచి విడిపోయినప్పుడు తన సంపదలో అత్యధిక భాగాన్ని వితరణకు వెచ్చించేందుకు వీలుగా మెకంజీ స్కాట్ సంతకం చేశారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో స్కాట్‌కు 4 శాతం వాటా లభించింది. అమెజాన్ షేరు జోరందుకోవడంతో ఈ ఏడాది స్కాట్ సంపద 23.6 బిలియన్ డాలర్లమేర పెరిగి 60.7 బిలియన్ డాలర్లకు ఎగసింది.
ఈ ఏడాది ఇప్పటివరకూ స్కాట్ 5.7 బిలియన్ డాలర్లను వితరణకు వెచ్చించడం గమనార్హం! వితరణ కోసం 6,500 సంస్థలను పరిశీలించాక 384 ఆర్గనైజేషన్స్‌ను సలహాదారులు ఎంపిక చేసినట్లు స్కాట్ తెలియజేశారు. ఆహారం, జాతి వివక్ష, పేదరికం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులను విడుదల చేసినట్లు వివరించారు.