సికింద్రాబాద్ కంటోన్మెంట్: తెలుగు రాష్ట్రం తెలంగాణ పోలీసు శాఖలో వచ్చే ఏడాది 2021 లో 20 వేల పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ రోజు అన్నారు. సిటీ నార్త్‌జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూ షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పెంచుతున్నామని హోం మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో ఆగిపోయిన నూతన పోలీసుస్టేషన్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.
రాష్ట్రంలో నేరాల నిరోధానికే ప్రాధాన్యం ఇస్తున్నామని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర కమిషనర్ అంజనీకుమార్, మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఓలేటి దామోదర్, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.