న్యూఢిల్లీ: హింసకు తావు లేకుండా శాంతియుతంగా నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
రైతులు తమ నిరసనను తెలిపే హక్కును హరించకూడదని తెలిపింది. అయితే, నిరసన ప్రదర్శన అనేది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదని, ఎవరికీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగరాదని పేర్కొంది. పౌరులు స్వేచ్ఛగా తిరుగాడే, ఇతర సదుపాయాలు పొందే హక్కులకు ఎప్పుడూ ప్రభుత్వాలు అడ్డంకి కాకూడదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కాగా, నిరసన తెలిపే హక్కు ఉంది అంటే అర్థం నగరంలోని రహదారులన్నీ మూసివేయడం కాదు అని తేల్చింది. ఇప్పటికిప్పుడు వ్యవసాయ చట్టాల ప్రామాణికత ప్రధానం కాదని స్పష్టం చేసింది. రైతులు చర్చలకు ముందుకు రాకుండా ఆందోళన కొనసాగిస్తున్నంత మాత్రాన ఫలితం ఉండదని, రైతాంగం డిమాండ్లు నెరవేరాలంటే చర్చలు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే పేర్కొన్నారు.
రైతు ఆందోళనలకు సంబంధించిన అన్ని వాదనలు, రైతు సంఘాల అభిప్రాయాలను విన్న తరువాత, అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసిన తరువాత మాత్రమే రైతు సమస్య పరిష్కారానికి కమిటీ నియమిస్తామని జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది.