అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రేషనలిజేషన్, మరియు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం అన్ని చకచకా జరిగాయి. అయితే వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి టీచర్లు నానా తంటాలు పడుతున్నారు. సర్వర్ సహకరించక, వేగమైన ఇంటర్నెట్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు.
దీని వల్ల ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను రేపు(శుక్రవారం) అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 18 వ తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని పేర్కొన్నారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయే పరిస్థితి ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74, 418 మంది ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారని అయన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఇంజనీరింగ్ ఫీజులు క్రితం ఏడాది ఉన్న తరహాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని, దీనిపై తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూలును శుక్రవారం లేదా శనివారం ప్రకటిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.