మాలీవుడ్: 2015 లో మలయాళం లో విడుదలై సూపర్ సక్సెస్ సాధించిన సినిమా ‘ప్రేమమ్’. తెలుగు లో కూడా చందూ మొండేటి దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా ఈ సినిమా రీ మేక్ చేయబడింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది యువత మళయాళం సినిమాల వైపు ఒక చూపు చూసేలా చేసింది ఈ సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అల్ఫోన్సే పుత్తిరన్ ఆ తర్వాత ఇంత వరకు సినిమా చెయ్యలేదు. కేవలం నేరమ్ మరియు ప్రేమమ్ అనే సినిమాలు చేసిన ఈ దర్శకుడు ప్రస్తుతం నయనతార తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార తో పాటు విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.
ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ప్రకటన తో పాటు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ‘పాట్టు’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందబోతుంది. టైటిల్ పోస్టర్ లో ఒక టేప్ రికార్డర్ కాసెట్ ని పెట్టారు. కేవలం దర్శకుడిగా కానే కాకుండా రచయితగా, నిర్మాతగా, నటుడిగా, మ్యూజిక్ కంపోజర్ గా కూడా మల్టీటాలెంటెడ్ గుర్తింపు ఉన్న డైరెక్టర్ గా అల్ఫోన్సే పుత్తిరన్ కి మంచి పేరుంది. అలాంటి డైరెక్టర్ నుండి సినిమా అంటే అంచనాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. టైటిల్ పోస్టర్ నుండే తన క్రియేటివ్ సైడ్ ని చూపిస్తున్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాని కూడా మరొక మ్యూజికల్ హిట్ దిశగా తీసుకువెళ్లే ప్రయత్నంలో డైరెక్టర్ ఉన్నాడు.