న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు అందించింది. తమ రాష్ట్రాలలో సులభతర వాణిజ్యంలో నిర్దేశిత సంస్కరణలను అమలు చేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రూ. 2,508 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 2,525 కోట్ల మేర బహిరంగ మార్కెట్ ద్వారా కావాల్సిన అదనపు రుణాలను సమీకరించుకొనేందుకు అనుమతిచ్చింది.
ఈ అనుమతి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు ఐదు రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ. 16,278 కోట్లను అదనపు రుణాలు సేకరించుకొనేందుకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు అదనపు నిధుల అవసరాలను తీర్చుకొనేందుకు వీలుగా రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్‌డీపీలో రెండు శాతం మేర పెంచాలని కేంద్రం ఈ ఏడాది మేలో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అదనపు రుణాలు సమీకరించుకొనేందుకు అర్హత సాధిం చాలంటే 2021 ఫిబ్రవరి 15లోగా నాలుగు రకాల సంస్కరణలను అమలు చేయాలని షరతు విధించింది.
వీటిలో ముఖ్యమైన వాటిలో ఒకటైన ఒక దేశం–ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయడంతోపాటు రాష్ట్రంలో సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టాలనే నిబంధన పెట్టింది. ఒక్కో సంస్కరణను అమలు చేసే రాష్ట్రం ఆ రాష్ట్ర జీఎస్‌డీపీలో 0.25 శాతానికి సమానంగా అదనపు రుణా లుపొందే వీలు ఉంటుందని పేర్కొంది. ఈ లెక్కన 4 సంస్కరణలు అమలు చేసే రాష్ట్రానికి ఆ రాష్ట్ర జీఎస్‌డీపీలో రెండు శాతం మేర అదనపు రుణ సమీకరణకు అనుమతి ఇస్తామని తెలిపింది.
ఇలాంటి నాలుగు సంస్కరణల్లో ఇప్పటిదాకా 10 రాష్ట్రాలు ఒక దేశం–ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయగా ఐదు రాష్ట్రాలు సులభతర వాణిజ్యంలో సంస్కరణలు, రెండు రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో సంస్కరణలను అమలు చేశాయని అందుకే వాటికి అదనపు రుణలకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.