fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshదేశానికి ఏపీ పోలీస్ ఆదర్శం: డిజీపి

దేశానికి ఏపీ పోలీస్ ఆదర్శం: డిజీపి

AP-POLICE-ROLE-MODEL-FOR-NATION

అమరావతి: ఏపీ పోలీస్‌ అనేక విషయాల్లో సమర్థవంతమైన సేవలందిస్తూ మన దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని ఏపీ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి మంగళవారం అవార్డులను అందజేశారు. ‘ఏపీఎస్‌పీ కమాండేషన్‌ డీజీపీ డిస్క్‌ అవార్డు’ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అవార్డులను తొలిసారిగా 38 మందికి ఇచ్చారు.

ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో ఏపీ పోలీస్‌ శాఖ సిబ్బంది, వనరుల కొరత వంటి అనేక సమస్యలను ఎదుర్కొందన్నారు. వీటన్నింటినీ అధిగమించిన ఏపీ పోలీస్‌ శాఖ ఇప్పుడు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తోందన్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచీ ఉన్న బెటాలియన్స్‌ ఫోర్స్‌ అనేక పోలీస్‌ విభాగాలకు వెన్నెముకగా ఉండటం ఎంతో గర్వకారణమని సవాంగ్‌ కీర్తించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్‌ వంటి కీలక విభాగాల్లో 80 శాతం మంది ఏపీఎస్‌పీ సిబ్బంది డెప్యూటేషన్‌పై పనిచేయడం కూడా చాలా గొప్ప విషయమన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వీరు సేవలు అందించిన ఘన చరిత్ర ఉందన్నారు.

ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ మాట్లాడుతూ, 2012 నుంచి 2015 వరకు ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌ బాధ్యతలు నిర్వర్తించిన డీజీపీ సవాంగ్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన సవాంగ్, సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, హోంగార్డ్స్‌ ఏడీజీ హరీష్‌కుమార్‌గుప్తా, బెటాలియన్‌ కమాండెంట్‌ దీపికా పాటిల్‌ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మైక్రో ఫైనాన్స్‌ ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సవాంగ్‌ చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ, మొబైల్‌ లోన్‌ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వీటి బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular