అమరావతి: రాబోయే కొన్ని రోజుల్లో మన దేశంలో కూడా కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఒకటి రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించవచ్చు అని వార్తలొస్తున్న నేపథ్యంలో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో సోమవారం వ్యాక్సిన్ మాక్ డ్రిల్ మొదలైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ప్రారంభించారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం కేంద్రాలకు వచ్చేవారికి టీకా ఇవ్వడానికి వాస్తవంగా ఎంత సమయం పడుతుంది, దానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు అమలు జరపడంలో ఎదురయ్యే ఇబ్బందులేమిటి, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తే పక్షంలో ఏమి చేయాలి అనే అంశాలు ఇందులో గుర్తిస్తారు.
వ్యాక్సిన్ల భద్రత, వాటి తరలింపు, అందులో ఏర్పడే లోటుపాట్లు తెలుసుకోవటం, వ్యాక్సిన్ తీసుకోవటానికి వచ్చేవారు నిబంధనల ప్రకారం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించటం ఈ డ్రై రన్ వెనకున్న ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం అమలుచేసే క్రమంలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయం ఎలావున్నదో కూడా పరీక్షించి చూస్తారు. వీటన్నిటినీ పరిశీలించి మరింత పకడ్బందీ విధానానికి రూపకల్పన చేస్తారు.
దేశంలో అంటురోగాల నివారణకు టీకాలివ్వటం సాధారణమైన విషయమే అయినా తొలిసారి 1978లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1985లో దాన్ని సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం(యూఐపీ) గా పేరు మార్చి మరింత విస్తృతపరిచారు. గర్భిణులకు, పిల్లలకు వివిధ రకాల వ్యాధులు సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా టీకాలివ్వటం అప్పటినుంచీ కొనసాగుతోంది.