న్యూఢిల్లీ: దేశంలో నుతనంగ ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది, ఈ నేపథ్యంలో డిసెంబర్ 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. అయితే ప్రభుత్వ ఆహ్వానాన్ని సూత్రప్రాయంగా మాత్రమే అంగీకరిస్తున్నామని సంఘాలు తెలిపాయి.
కొత్త బిల్లులకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఆందోళనలు 34వ రోజుకు చేరుకున్నాయి. ప్రతిష్టంభన తొలగించేందుకు ఈనెల 30న చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాలను ఆహ్వానించింది. సాగు చట్టాలకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించి ఒక సరైన పరిష్కారం కనుగొనేందుకు చర్చిద్దామని కేంద్రం తెలిపింది.
ఈ బుధవారం విజ్ఞాన భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాలని రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ లేఖలో కోరారు. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య ఐదు మార్లు చర్చలు జరిగాయి. ఈనెల 30న చర్చలకు రావాలన్న కేంద్ర ప్రతిపాదనపై రైతు సంఘాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి. కానీ ముందుగా కేంద్రం చర్చల ఎజెండాను ప్రకటించాలని కోరాయి.
వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ చట్టంపై ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా బలోపేతం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించింది. ఈమేరకు జనవరి 6, 7 తేదీల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏఐఏడబ్ల్యూయూ పిలుపునిచ్చింది. జిల్లా స్థాయిలో వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ తెలిపారు.