బీజింగ్: 2019 నవంబర్ లో చైనాలోని వూహాన్ లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఆ వైరస్ దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఇదిలా ఉండగా యూకే లో బయట పడిన కొత్త వైరస్ స్ట్రెయిన్ ఇప్పుడు మళ్ళీ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తొంది.
అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు స్థానమైన వూహాన్‌లో కమ్మ్యూనిస్ట్ చైనా ప్రభుత్వం ఉన్నట్టుండి ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. కోటి మందికిపైగా జనాభా ఉన్న ఈ నగరంలోని 15 జిల్లాల్లో డిసెంబర్ 24వ తేదీ నుంచే ఈ కార్యక్రమం మొదలైనట్లు సమాచారం.
వూహాన్ నగరంలో వ్యాక్సినేషన్ కోసం 48 కేంద్రాలను ఏర్పాటు చేసి 18–59 మధ్య వయస్సు గల ప్రజలకి నాలుగు వారాల వ్యవధిలో రెండు టీకా డోసులు ఇస్తున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ హి ఝెన్యు తెలిపారని అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.