న్యూఢిల్లీ: దాదాపు నెల రోజుల తరువాత బుధవారం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండడంతో ఇంధన రంగ పీఎస్‌యూలు ధరలను వరుసగా రెండో రోజు కూడా పెంచాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 26 పైసలు చొప్పున పెంచాయి. బుధవారం సైతం లీటర్ పెట్రోల్ ధరను 26 పైసలు, డీజిల్ ధరను 25 పైసలు చొప్పున పెంచాయి.
ఈ పెరుగుదల తరువాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 84.20కు చేరింది. డీజిల్ రూ. 74.38కు చేరింది. ఇంతక్రితం 2018 అక్టోబర్‌లో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 84కు ఎగసింది. అప్పుడు పెరిగిన ధరనే ఆల్‌టైమ్ గరిష్టం కాగా, ఇప్పటి ధర ఆ స్థాయిని అధిగమించడం గమనార్హం. ఇక డీజిల్ ధరలైతే 2018 అక్టోబర్ 4న లీటర్‌కు రూ. 75.45 వరకూ పెరుగగా, 2020 మే నెల నుంచి చూస్తే.. పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ. 14.51 పుంజుకోగా, డీజిల్ ధర రూ. 12.09 పెరిగింది.
దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నట్లు పెట్రోలియం వర్గాలు ప్రస్తావించాయి. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఇంధన ధరలను పరిశిలిస్తే ముంబైలో తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 90.83ను తాకగా.. డీజిల్ రూ. 81.07కు చేరింది. చెన్పైలో పెట్రోల్ రూ. 86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 85.68 వద్ద, డీజిల్ రూ. 77.97 వద్ద విక్రయమవుతోంది.
ఇతర దేశాల మార్కెట్లో గత రెండు రోజుల్లో దాదాపు 6 శాతం జంప్‌చేసిన ముడిచమురు ధరలు ఇవాళ మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ 0.85 శాతం పుంజుకుని 51 డాలర్లను అధిగమించింది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే బ్రెంట్ చమురు సైతం బ్యారల్ 0.7 శాతం ఎగసి 54.67 డాలర్లకు చేరింది. దీంతో 2020 ఫిబ్రవరి 24 తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే వీలున్నట్లు ఇంధన రంగ నిపుణులు తెలియజేశారు.