అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పట్టణాలు మరియు నగరాలలోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్భన్ డవలప్‌మెంట్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
పట్టణాలు, నగరాల్లో వైఎస్సార్ హయాంలో రాజీవ్ స్వగృహ పేరిట గతంలో ఒక కార్యక్రమం జరిగేది, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఫ్లాట్లు ఇవ్వాలన్నది ఆ కార్యక్రమ ఉద్దేశం. ఇప్పుడు ఫ్లాట్లకు బదులు వివాదాల్లేని విధంగా, క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకు ప్లాట్లు ఇవ్వాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచన అని సీఎం తెలిపారు.
ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధిచేసి ప్లాట్లను తయారుచేసి లబ్ధిదారులకు కేటాయించడం వల్ల ప్రైవేటు వ్యక్తుల వద్ద స్థలాలు కొనుక్కుంటున్న వారికి ఆందోళనలు తగ్గుతాయన్నారు. లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే అలాంటి ఆందోళనలు, భయాలు ఉండవు. వివాదాలు లేకుండా, క్లియర్ టైటిల్స్‌తో కూడిన ఇంటి స్థలాలు, ప్రభుత్వం లాభాపేక్షలేకుండా వ్యవహరించడం వల్ల తక్కువ ధరకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఈ ప్లాట్లను అందించాలి. మధ్యతరగతి ప్రజలకోసం కూడా ఏదైనా చేయాలన్న తపనతో ఈ ఆలోచన వచ్చింది అని సీఎం ప్రకటించారు.