జకార్తా: కరోనా మహమ్మారి వచ్చాక అందరి జీవితాల్లో చాలా భారీ మార్పులే తెచ్చింది. వేడుకలు, పండగలు, పబ్బాలు అనేవి ఎక్కడా లేవు. మూతికి మాస్క్, చేతికి శానిటైజర్ తప్పనిసరి అయ్యాయి. ఇక బస్సు, రైలు, విమాన ప్రయాణాలు అంటేనే జనాలు దడుచుకునే పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఇంకా ఇప్పటికి చాలా మందిలో కరోనా భయం మాత్రం అలానే ఉంది. దానికి తోడు ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తోంది. అందుకే నలుగురితో కలవాలన్న కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి చేప్పుకోబోతున్నాం.
కరోనా వైరస్‌కు భయపడి తన ప్రయాణం కోసం ఆ వ్యక్తి ఏకంగా విమానం మొత్తాన్ని ఇద్దరి కోసం బుక్ చేసుకున్నాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇండోనేషియా జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ ఇటీవల తన భార్య షల్విన్నీ ఛాంగ్‌తో కలిసి బాలీకి వెళ్లారు. అయితే ఇందుకోసం ఆయన లయన్ ఎయిర్ గ్రూప్‌నకు చెందిన బాటిక్ ఎయిర్ విమానంలోని అన్ని టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఎవరో తెలియని ఇతర ప్రయాణికులతో విమానంలో ప్రయాణిస్తే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని భావించిన రిచర్డ్, వైరస్ నుంచి రక్షణ కోసం ఈ విధంగా విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ఈ విషయాన్ని రిచర్డ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఖాళీగా ఉన్న విమానంలో కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘విమానంలోని సీట్లన్నీ బుక్ చేసినా కూడా.. ప్రైవేట్ జెట్ కంటే తక్కువ ఖర్చే అయ్యింది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.