భోపాల్: ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ పట్ల సామాన్య ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాల నేపథ్యంలో టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారని వార్తలు చూశాము. ఇప్పుడు అదే జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ కూడా చేరుకుంది.
హైదరాబాద్ కంపెనీ అయిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ తీసుకున్న ఓ వలంటీర్ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంకా మూడోదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం పట్ల విపక్షాల నుండి విమర్శలు వస్తుండగా, ఇప్పుడు వలంటీర్ మృతి చెందడం ఈ వివాదాన్ని మరింత పెంచుతోంది.
మధ్య ప్రదేశ్ భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (42) గతేడాది డిసెంబర్ 12న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్‌లో నిర్వహించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకే అతడు చనిపోయాడు. అయితే చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
ఈ క్రమంలో కోవాగ్జిన్ ట్రయల్‌లో పాలు పంచుకున్న మెడికల్ కాలేజీ వైస్ చాన్సిలర్ మాట్లాడుతూ, ‘దీపక్ మరవి వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగంగా కోవాగ్జిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లు తెలిసింది. విష ప్రయోగం వల్ల చనిపోయాడని అనుమానిస్తున్నాం.. కానీ మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే విషయం తెలుస్తుంది’ అన్నారు.