అమరావతి: తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లేవారు ఈ సారి చాలా మటుకు సొంత వాహనాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బస్సులకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో (ఎన్‌హెచ్–65) సొంత వాహనాలు కిటకిటలాడుతున్నాయి.
మిగతా రోజుల్లో ఈ మార్గంలో నాలుగువేల నుంచి ఐదువేల వ్యక్తిగత వాహనాలు టోల్‌గేట్లను దాటుతుంటాయి. కానీ గత రెండురోజుల నుంచి 12 వేల వరకు వాహనాలు టోల్‌గేట్ల మీదుగా వెళుతున్నాయి. సొంతూళ్లకు వెళ్ళడానికి ప్రజలు సొంత వాహనాలు, క్యాబ్‌లనే ఆశ్రయిస్తున్నారనేందుకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో డిమాండ్ తక్కువగా ఉండటమే నిదర్శనం. ఆర్టీసీ రెగ్యులర్ రిజర్వేషన్లు కూడా 60 శాతం దాటడం లేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే సగం సీట్లు కూడా నిండలేదు.
ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆరురోజులు ఆర్టీసీ రిజర్వేషన్లను పరిశీలిస్తే రెగ్యులర్ సర్వీసుల్లో 60 శాతం ఆక్యుపెన్సీ దాటలేదు. ప్రత్యేక సర్వీసుల్లో అయితే 48.03 శాతం రిజర్వేషన్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ సారి ఆర్టీసీ రిజర్వేషన్లపై ప్రయాణికులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పండుగకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణంలోను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సుల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీలోని ముఖ్య నగరాలకు, పట్టణాలకు 571 సర్వీసులు ఏర్పాటు చేసింది.
ప్రతిసారీ సంక్రాంతి పండుగ సీజన్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు, తిరుగు ప్రయాణానికి అడ్వాన్స్ రిజర్వేషన్లు చేయించుకోవడం అలవాటు. కానీ కరోనా కారణంగా ఎక్కువ శాతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో 90 శాతం మంది ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నట్లు ఆర్టీసీ ట్రాఫిక్ వింగ్ అంచనా వేస్తోంది. రిజర్వేషన్లు బాగా తక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు.
విద్యాసంస్థలు తెరవకపోవడం, ఆన్‌లైన్ క్లాస్‌లు జరగడం వల్లే విద్యార్థులు కూడా సొంత ప్రాంతాలను దాటి రాలేదని, అందువల్లే రిజర్వేషన్లు చేసుకోలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఆశాజనకంగా రిజర్వేషన్లు ఉన్నాయి.