హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను మరో సంస్థ త్వరలో పెట్టబోతోంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజు ప్రకటించారు. ఈ వారానికి ఇంతకంటే శుభారంభం ఏముంటుంది? అని సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు.
హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ‘మాస్ మ్యూచువల్’ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల తొలిసారి రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. మాస్ మ్యూచువల్ కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన వెలువడడంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ‘‘ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒకటైన మాస్ మ్యూచువల్ను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మాస్ మ్యూచువల్ అమెరికాకు చెందిన సంస్థ. ఈ కంపెనీ టాప్ ఫార్చూన్- 500లో చోటు దక్కించుకుంది. ఆ సంస్థ తొలిసారి అమెరికా వెలుపల రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు హైదరాబాద్లో పెడుతుండడం విశేషం అని తెలిపారు.