కౌలాలంపూర్: కరోనా వైరస్ పేరు చెప్పి రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో దాన్ని అణచివేసి మలేషియాలో అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రధానమంత్రి విధించారు. నిజానికి వైరస్ పంజా విసురుతున్నప్పటికీ, మలేషియాలో పది నెలలుగా రాజకీయ సంక్షోభం నెలకొంది.
ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నికలు, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ ఎన్నికలు కూడా జరగాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వస్తుందనే భావనతో కరోనా పేరు చెప్పి దేశంలో అత్యవసర పరిస్థితిని మంగళవారం ఆ దేశ ప్రధానమంత్రి ముహిద్దీన్ యాసీన్ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ దేశ రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా వ్యతిరేకించారు. దీంతో ఇప్పుడు మలేషియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీన్ని కారణంగా చూపి అత్యవసర పరిస్థితి విధించడం సరికాదని కొట్టి పారేస్తున్నారు.
క్రిత సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితంతో ఏర్పడిన పరిస్థితుల వలన ప్రస్తుతం అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని ఆ దేశంలోని మీడియా ఆరోపిస్తోంది. అత్యవసర పరిస్థితి విధింపుతో ఆ దేశంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఉండదు. అయితే అత్యవసర పరిస్థితి విధించడాన్ని అక్కడి రాజకీయ పార్టీలు ‘చీకటి రోజు’గా అభివర్ణించాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 1 లక్ష 38 వేల కరోనా కేసులు నమోదవగా, 555 మరణాలు సంభవించాయి.