టాలీవుడ్: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ ఆల్బమ్ అయింది. అన్నీ బాగుంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన సినిమా ఇప్పుడు విడుదల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘ప్రేమలో మునిగి తేలండి’ అంటూ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు సినిమా టీం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ అందించిన కథ తో ‘సుకుమార్ రైటింగ్స్’ పేరుతో ఈ సినిమా రూపొందింది. సుకుమార్ శిష్యుడు ‘బుచ్చిబాబు సాన’ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
టీజర్ ఆద్యంతం మిగతా పాత్రలేవీ కాకుండా కేవలం హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమని మాత్రమే చూపించి ఆకట్టుకున్నారు. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అని అనడం లో సందేహమే లేదు. సినిమా చివర్లో ‘ఐ లవ్ యు’ అని కాకుండా ‘లవ్ యూ ఐ’ అని రాసి నీకు నాకు మధ్య ప్రేమ ఎందుకులే అని తీసేసి మనం ఇంకా దగ్గరగా ఉండాలని అలా రాసా అనే డైలాగ్ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయో అని ఒక సాంపుల్ ఇచ్చారు. చివర్లో సముద్రపు ఒడ్డున గాయాలతో పడి ఉండడం చూసి ట్రాజిక్ ఎండింగ్ ఉందేమో అని కూడా అనిపిస్తుంది. ఎప్పటినుండో విడుదల చెయ్యాలనుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు చూస్తున్నారు.