టాలీవుడ్: టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి తిరిగి కంబ్యాక్ వస్తూ చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమాని హిందీ లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాకి రీమేక్ గా రూపొందిస్తున్నారు. హిందీ లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇందులో లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు. సంక్రాతి సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ హడావిడి మొదలైంది.
టీజర్ మొత్తం పవన్ కళ్యాణ్ షో అని చెప్పుకోవచ్చు. ‘కోర్ట్ లో వాదించడమూ తెలుసు.. కోర్ట్ బయట కొట్టడమూ తెలుసు’ అంటూ సాగే డైలాగ్ తో టీజర్ ద్వారా ఆకట్టుకున్నారు. ఈ టీజర్ ద్వారా సినిమా టీం కి కూడా పవన్ కళ్యాణ్ హీరోయిజమ్ వాడి థియేటర్ లకి జనాలని రప్పించడం ఎలాగో తెలుసు అని అర్ధం అవుతుంది. మామూలుగా హిట్ ప్లాప్ కి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి. అందులోనూ మూడు సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరో సినిమా వస్తుండడం తో ఇన్నాళ్లూ ఎదురు చూసిన అభిమానులు టీజర్ కి రికార్డు సంఖ్య లో వ్యూస్ పెంచారు. టీజర్ లో పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, స్క్రీన్ ప్రెజన్స్ అభిమానులని ఆకట్టుకుంది.
శ్రీ వెంకటేశ్వర సినిమా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ఎం సి ఏ’, ‘ఓహ్ మై ఫ్రెండ్’ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిజమ్ కోసం మరి కొంత స్టోరీ ని జత చేసారు. పవన్ కళ్యాణ్ కి జోడీ గా శృతి హాసన్ నటించింది. మరిన్ని పాత్రల్లో అంజలి, నివేత థామస్ , ‘మల్లేశం‘ ఫేమ్ అనన్య నాగళ్ళ నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని మర్చి లో లేదా ఏప్రిల్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.