గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. గుంటూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, ‘ఇవాళ చాలా ఆనందంగా ఉంది. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో అందరం చాలా ఇబ్బంది పడ్డాం. కనీవిని ఎరుగని విపత్తును చూశాము. ఈ కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించడం చూశాం. దానికి విరుగుడుగా మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలు పెట్టి సఫలమయ్యాయి’ అని తెలిపారు.
గుంటూరు జిల్లాలో 31 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ మహమ్మారిని తరిమేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు రెండు డోసులు టీకా వేసుకోవాలి. వ్యాక్సినేషన్ జరిగిన తరువాత లబ్ధిదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దశలవారీగా అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది’ అని సుచరిత తెలిపారు.