వాషింగ్టన్: అమెరికాలో ప్రతి సంవత్సరం ఒక బిగ్ ‘డే’లు ఉంటుంది, అది ప్రతి యేటా వచ్చే ఇండిపెండెన్స్ డే. దానితో పాటు ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే ఈ ఇనాగురేషన్ డే ఇంకొకటి. అమెరికా స్వాతంత్య్ర దినం జూలై 4. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ దినం జనవరి 20. ఈ రెండు రోజులు అమెరికాలో చాలా ప్రాధాన్యం ఉన్న రోజులు.
అక్కడ దేశ స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, ప్రమాణ స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఆమెరికా ఇనాగురల్ డే. జో బైడెన్, కమలా హ్యారిస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరున్నా లేకున్నా, ఎవరి పార్టీ ఏదైనా, కొత్త అధ్యక్షుడి స్వీకారంలో పాత అధ్యక్షుడు ఉండటం సంప్రదాయం.
కాగా ప్రస్తుత అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ బైడెన్ వేడుకకు ‘స్కిప్’ కొట్టనున్నారు. అంటే, ఆయన ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. బైడెన్ గెలవక ముందు నుంచే ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ట్రంప్. బైడెన్ గెలిచాక ‘నీ గెలుపును గుర్తించను ఫో..’ అన్నట్లే ఉండిపోయారు. అలాగని అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వీపు చూపించిన అధ్యక్షులలో ట్రంపే మొదటి వారు కాదు, ఇంకొకాయన కూడా ఉన్నారు.
ఇప్పుడు ట్రంప్ స్కిప్ కొట్టినట్లు, శత్రుత్వ భావనతో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఒకప్పుడు స్కిప్ కొట్టిన అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. అమెరికా రెండవ అధ్యక్షుడు ఆయన. 1797 నుంచి 1801 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ ‘ప్రో అడ్మినిస్ట్రేషన్’. యు.ఎస్.లో తొలి రాజకీయపార్టీ అది. దానికే ఇంకో పేరు ‘ఫెడరలిస్ట్’ పార్టీ. ఆయన తర్వాత అధ్యక్షులు అయినవారు థామస్ జెఫర్సన్.