అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ స్థానిక ఎన్నికలకు అన్ని అడ్డంకులు తొలగిపొయాయి. ఈ ఎన్నికలలో పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావు లేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
ఏకగ్రీవంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికైతే, ఆ ఊరి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి గరిష్టంగా రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా లభించనున్నాయి. ప్రశాంతమైన పచ్చ వాతావరణం గల పల్లెల్లో ఎన్నికలు కక్షలకు కారణం కాకూడదని, గ్రామీణుల సర్వశక్తులు అభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మధ్య విభేదాలు తలెత్తకుండా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు నిర్దేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ ఎన్నికల వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోయి గ్రామాభివృద్ధిని ఇబ్బందుల్లోకి నెట్టరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 12వ తేదీన ఈ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఒక గ్రామానికి ఏడాది వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే అన్ని రకాల గ్రాంట్లు, ఇంటి పన్ను రూపంలో వసూలయ్యే డబ్బుల కంటే ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల ద్వారా అధికంగా నిధులు అందనున్నాయి.
73, 74వ రాజ్యాంగ సవరణల తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఐదోసారి జరగనున్నాయి. 2001 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విభజన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రోత్సాహకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది.