అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థలైన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు ఈ సమావేశాంలో పాళ్గొన్నారు. సమీక్ష అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరియు వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి రావటంతో, పోలీసులకు కలిగే ఇబ్బందులను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం అని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌కు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు.
ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందిలో ఎవరికైనా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్న వారి విషయంలో మినహాయింపులపై ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై 13 జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.