న్యూఢిల్లీ: దేశంలో జరిగిన కరోనా వైరస్ సంక్షోభం, వాక్సినేషన్ ప్రక్రియ, మరియు మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలోని తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. కోవిడ్-19 నియమ నిబంధనలు పాటిస్తూ రెండు సభలు కొలువయ్యాయి. తొలిరోజు సమావేశంలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టారు.
భారత దేశం లో అధికార కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాల తీసుకోవడం కారణంగా దేశంలో లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనా నుంచి కాపాడుకోగలిగామని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కొత్త కరోనా కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య చాలా కూడా చాల ఎక్కువగానే ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
రామ్నాథ్ కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: దేశంలో తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాం. కరోనా వచ్చిన తర్వాత కొత్త సామర్థ్యంతో శక్తివంతమైన దేశంగా భారతదేశం నిలిచింది. ఆర్థిక సంక్షోభం నుండీ ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాం.
సంక్షేమ పథకాలతో ప్రజలకు సరైన సమయంలో అండగా నిలిచాం. కరోనాపై చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం. మానవత్వంతో కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించాం. పేదల కోసం వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అమలు చేశాం.
జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్ కల్యాణ్ యోజన అమలు చేశాం. 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా కూడా అవుతున్నాయి. ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి.
రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్‌లోనే కలిపి ప్రకటించనున్నారు.