ముంబై: వెస్ట్ బెంగాల్‌కు దాదాపు దశాబ్దానికి పైగా ప్రాతినిధ్యం వహించిన పేసర్ అశోక్ దిండా మంగళవారం అంతర్జాతీయ మ్యాచ్లతో సహా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆశోక్ దిండా టీమిండియా తరపున 13 వన్డేల్లో 12 వికట్లు, 9 టీ20ల్లో 17 వికెట్లు తీయగా, ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లాడి 69 వికెట్లు తీశాడు.
అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 116 మ్యాచ్‌లాడిన దిండా 420 వికెట్లు తీశాడు. పశ్చిమ బెంగాల్ తరపున దశాబ్దం పాటు ఆడిన దిండా తనపై తప్పుడు ఆరోపణలు రావడంతో గతేడాది బెంగాల్ జట్టు నుంచి వైదొలిగాడు. కాగా ఈ సీజన్‌లో అశోక్ దిండా గోవాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ్యాచ్‌ల్లో అతను పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా దిండా మీడియాతో మాట్లాడాడు.’భారత్ తరఫున ఆడాలనేది ప్రతి ఆటగాడికి ఉండే బలమైన ఒక కోరిక. నేను బెంగాల్ తరఫున ఆడాను. అందుకే నాకు దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. భారత్ తరఫున ఆడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బీసీసీకి కృతజ్ఞతలు. దీప్‌దాస్ గుప్తా, రోహన్ గావస్కర్ వంటి సీనియర్ ఆటగాళ్లు నాకు మార్గనిర్దేశనం చేశారని’ దిండా పేర్కొన్నాడు.