వాషింగ్టన్: అమెరికాలో వలసలకు సంబంధించి జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు పరుస్తూ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ రద్దు చేశారు. దీనికి సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, ‘‘నేను కొత్త చట్టాలు చేయడం లేదు. పాత విధానాలను రద్దు మాత్రమే చేస్తునాన్నారు.
మన దేశానికి తలవంపులు తెచ్చేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పాలసీలను కేవలం చక్కదిద్దుతున్నాం, అని పేర్కొన్నారు. కాగా అమెరికాలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో ట్రంప్ యంత్రాంగం తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేసి ప్రభుత్వ సంరక్షణలో ఉంచింది.
జీరో టాలరెన్స్ పేరిట చేపట్టిన ఈ అమానుష చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సరిహద్దు అధికారులు వలసదారులపై ఉక్కుపాదం మోపిన తీరును కళ్లకు కట్టేలా అప్పట్లో ఎన్నో ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక నూతన అధ్యక్షుడు బైడెన్ ఆ విధానానికి స్వస్తి పలికేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పిల్లలను తిరిగి కన్నవారి చెంతకు చేర్చేందుకు వీలుగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడం, వలస విధానాన్ని న్యాయబద్ధంగా అమలు చేయడం వంటివి ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ట్రంప్ హయాంలో అమానుషంగా చిన్నారులను వేరు చేశారు. వారిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాం అని హామీ ఇచ్చారు.