హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల ఎదురవుతున్న నష్టాల వల్ల బయటపడే కొత్త ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం కింద బస్సులను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి ప్రయోగాత్మకంగా మార్చి వటిని పరిశీలించి చూడాలని నిర్ణయించింది.
దీని కోసం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ఓ ప్రైవేటు సంస్థకు ఒక సిటీ బస్సును కూడా ఇప్పటికే కేటాయించింది. ఆ సంస్థ సిటీ బస్సు డీజిల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ ఇంజన్‌గా మార్చి మూడు నెలలపాటు దాని పనితీరును పరిశీలిస్తుంది. ఈ మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ వ్యయాన్ని డీజిల్ బస్సు నిర్వహణ వ్యయంతో పోల్చి చూడనుంది.
ఒక వేళ అన్ని లెక్కలు అనుకూలంగా ఉంటే మిగతా బస్సులను కూడా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు టెండర్లు పిలిచి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నివేదిక ఇచ్చే సంస్థకు కన్వర్షన్ బాధ్యత అప్పగించాలన్నది ఆర్టీసీ సమాలోచన. ఒక వేళ ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ఒక్క హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలో డీజిల్ రూపంలో అవుతున్న రూ. 460 కోట్ల వార్షిక భారం తొలగిపోనుంది. అదే మొత్తం సంస్థకు వర్తిస్తే ఏకంగా రూ. 1,926 కోట్ల వ్యయం తప్పుతుంది.
ప్రస్తుతం డీజిల్ ఇంజన్ల బస్సులను ఎలక్ట్రిక్ ఇంజన్లుగా మార్పిడి (కన్వర్షన్) చేసే ఖర్చు కూడా భారీగా ఉంది. ఆ భారాన్ని సైతం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. అందుకోసం ఆర్టీసీ మరో ప్రయోగం చేయాలన్న యోచనలో ఉంది. హైదరాబాద్‌లో 3 వేల బస్సులు తిరుగుతున్నాయి. వాటి రోజువారీ డీజిల్ ఖర్చు రూ. 1.30 కోట్లు.