న్యూఢిల్లీ: దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మార్గాలు కొత్త దారులు వెతుకుతున్నారు అక్రమార్కులు. ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త రూపంలో మాదక ద్రవ్యాలు జనంలోకి వస్తునే ఉన్నాయి. తాజాగా అమ్మాయి డ్రెస్‌లో డ్రగ్స్ పెట్టి విదేశాలకు ఎగుమతికి ప్రయత్నించారు. ఈ మేరకు డ్రెస్‌లో ఒక కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్ పెట్టి తపాలా ద్వారా ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఒక అందమైన లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్‌కు తీసుకు వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు పోస్టాఫీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన తీసుకువచ్చిన లెహెంగాను నిశితంగా పరిశీలించారు. వెంటనే వారు నిఘా అధికారులకు సమాచారం ఇచ్చారు.
సదరు అధికారులు ఆ డ్రెస్‌ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్రగ్స్ దొరికాయి. ఇది చూసి అధికారులు అవాక్కయ్యారు. డ్రగ్స్ సరఫరా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అతడు రవాణా చేయాలనుకున్న డ్రగ్స్ చాలా ప్రమాదకరమని, కాలేయం, మూత్రపిండాలు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది.