హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క మేయర్ ఎన్నిక, మరో పక్క పంచాయతీ ఎన్నిక వేడి రగులుతుండగానే ఎమెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. అయితే పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోని వారికి, ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.
కాగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల వరకు కొత్తగా ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటిని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంది. ఈ అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు సంపాదించిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తుంది.
ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువుకు 10 రోజుల ముందు అనగా ఫిబ్రవరి 13 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల తెలంగాణ ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు.
ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.