ముంబై: భారత్ లో బాగా ప్రాచుర్యం పొందిన బైక్ కంపెనీల్లో ఒకటైన జపాన్ ఆటో దిగ్గజం హోండా తన ప్రీమియం బైకుల విభాగంలోని సీబీ350ఆర్ఎస్ కొత్త మోటర్ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ యొక్క ధర రూ.1.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఫిబ్రవరి 16వ తేదీన లాంచ్ చేసిన ఈ బైక్ బుకింగ్స్‌ని కంపెనీ ప్రారంభించింది. అయితే డెలివరీలు మాత్రం మార్చి మొదటి వారం నుంచి మొదలవుతాయి. గతేడాది అక్టోబర్‌లో ‘‘మేడ్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్’’ నినాదంతో విడుదలైన హన్నెస్ సీబీ 350 నుంచి వస్తున్న రెండో బైక్ మోడల్ ఇది.
ఈ బైక్ దాదాపు 5500 ఆర్పీఎం వద్ద 1.5 కిలోవాట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే 350 సీసీ ఇంజిన్ కలిగి ఉంది. స్లిప్, అసిస్ట్ క్లచ్ సదుపాయాలను కలిగిన ఐదు స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో పొందుపరచబడింది. సెలక్టబుల్ టార్క్ కంట్రోల్, యాంటీ–లాక్ బ్రేకింగ్ వ్యవస్థలతో పాటు డిజిటల్ అనలాగ్ మీటర్లను కలిగి ఉంది.
హోండా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘సీబీ’ బ్రాండ్ వారసత్వాన్ని ఈ కొత్త సీబీ350ఆర్ఎస్ నిలుపుతుందనే ఆశాభావాన్ని హోండా మోటార్స్, స్కూటర్ ఇండియా ఎండీ అత్సుషీ ఒగాటా వ్యక్తం చేశారు.