న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో తాజాగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ధనవంతుల జాబితా ఈ రోజు విడుదల చేసింది. ముఖేష్ అంబానీ మొత్తం సంపద గత ఏడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు (అంటే సుమారు రూ .6.09 లక్షల కోట్లు) చేరుకున్నట్లు నివేదిక తెలిపింది.
కాగా చైనా జాంగ్ షాన్షాన్ ఇటీవలి వారంలో దాదాపు 22 బిలియన్ డాలర్లను కోల్పోయిన తర్వాత ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. ముకేష్ అంబానీతో పాటు అనేక ఇతర భారతీయ బిలియనీర్లు కూడా ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో గౌతమ్ అదానీ కుటుంబం రూ.2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానం, శివ నాడర్ కుటుంబం రూ.1.94 లక్షల కోట్ల సంపదతో 58వ స్థానం, లక్ష్మి ఎన్ మిట్టల్ రూ.1.40 లక్షల కోట్ల సంపదతో 104వ స్థానం, సీరం ఇన్స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా రూ.1.35 లక్షల కోట్లతో సంపదతో 113వ స్థానంలో నిలిచారు.
హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం భారత్లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం భారత్లో నివసిస్తున్నారు. ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.