బెంగళూరు: బెంగళూరులో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలడం తీవ్ర విషాదానికి దారితీసింది. తూర్పు బెంగళూరులోని బాబుసపల్య వద్ద మంగళవారం సాయంత్రం 4:10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవనం శిథిలాల కింద కనీసం 17 మంది చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక బృందాలు ఇప్పటివరకు ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి, మిగతా వారిని కాపాడేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
అగ్నిమాపక దళాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మరో 14 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని అంచనా. కూలిన భవనంలో ఉన్నవారిలో ఎక్కువమంది బీహార్‌కు చెందిన నిర్మాణ కార్మికులని అధికారులు వెల్లడించారు.
నిర్మాణంలో ఉన్న భవనం కూలిన సమయంలో కార్మికులు అక్కడ పనిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా బెంగళూరులో గత కొన్ని రోజులుగా సాధారణ జీవనం స్తంభించిపోగా, ఈ సంఘటనతో నగరంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టాలని విపత్తు నిర్వహణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.