అమరావతి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడనటువంటి రాక్షస పాలన నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.
“వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం, పోలీసుల్ని భారీ సంఖ్యలో మోహరించడం వంటి చర్యలు దేశంలోనే ఇదే మొదటిసారి చోటు చేసుకున్నాయి. స్వామివారి దర్శనానికి వెళ్తే అరెస్ట్ చేస్తామంటున్నారు. తిరుపతికి బీజేపీ నేతలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం దీనికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. చంద్రబాబు తమ 100 రోజుల పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో బాబు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు. ఆలయ పవిత్రతను చెరిపేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నారు,” అని జగన్ ఆరోపించారు.
తిరుమలలో నెయ్యి కొనుగోళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతాయని, నాణ్యతలో తేడా ఉంటే ట్యాంకర్లను తిరిగి పంపుతామని జగన్ వివరించారు. “బాబు హయాంలో 15 సార్లు నెయ్యి ట్యాంకర్లు తిరిగి వెనక్కి పంపించారు. మా హయాంలో 18 సార్లు పంపాం. నెయ్యి నాణ్యత విషయంలో ఎటువంటి లోపం లేదని టీటీడీ ఈవో రిపోర్ట్ ఇచ్చారు. సెప్టెంబర్ 20న ఈవో తెలిపిన ప్రకారం కల్తీ నెయ్యి వాడలేదని తేలింది. కానీ, చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తూ తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు,” అని జగన్ తెలిపారు.