హైదరాబాద్: నగరంలో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ బ్రోకింగ్ వ్యాపారం పేరుతో పథకాలు ప్రకటించి, భారీ వడ్డీ రాబడులను ఆశ చూపి డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ దాదాపు రూ. 7,000 కోట్లకు పైగా ప్రజలను మోసగించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన దీపాంకర్ బర్మాన్ ఈ స్కామ్‌కి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. అతనిపై దేశవ్యాప్తంగా 5 ప్రధాన నగరాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 23,000 మందికి పైగా బాధితులు ఉన్నారని పోలీసుల అంచనా.
స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరుతొ స్కాం
2018లో కార్యకలాపాలు ప్రారంభించిన డీబీ స్టాక్ బ్రోకింగ్, అధిక వడ్డీ ఆశతో పెట్టుబడిదారులను ఆకర్షించింది. వార్షికంగా 120 శాతం వడ్డీ, అర్ధ వార్షికంగా 54 శాతం, నెలవారీ పథకంగా 7 శాతం వడ్డీ వాగ్దానంతో పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు డబ్బులు తీవ్రంగా నష్టపోయారు.
పెట్టుబడిదారులు మోసపోయిన విధానం
పుప్పల్‌గూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పంచాక్షర్ సెప్టెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టినా, కంపెనీ వడ్డీ సంగతి అటుంచి అసలే ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు వాపోయారు. గచ్చిబౌలికి చెందిన గంటాడి హరీష్ రూ. 88.50 లక్షలు పెట్టుబడి పెట్టగా, కొంత వడ్డీ ఇచ్చి మిగతా డబ్బులతో కంపెనీ పరారైంది. రాజు మహేంద్ర కుమార్, విశ్వజీత్ సింగ్ వంటి పలువురు కూడా భారీగా నష్టపోయారు.
కేసుల నమోదు, విచారణ
హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, కోల్‌కతా, గౌహతి, ఢిల్లీలలో కూడా ఈ మోసంపై కేసులు నమోదయ్యాయి. బర్మాన్ ఆగష్టు నుండి కనిపించకుండా పోయి ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు సమాచారం. అతని ఆర్థిక మోసాలపై హైదరాబాద్ పోలీసులు, అస్సాం పోలీసులు సంయుక్తంగా విచారణ కొనసాగిస్తున్నారు.