న్యూ దిల్లీ: సుప్రీం కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సీజేఐ నేతృత్వంలోని ఈ బెంచ్ మరో ధర్మాసనానికి అప్పగించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్, తాజా నిర్ణయం ద్వారా తదుపరి విచారణను మరో ధర్మాసనం ముందు కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ కేసులో సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలన్న అంశంపై కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సీబీఐ, ఈడీ కేసులు విడివిడిగా లేక సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
మంగళవారం ఈ కేసు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రాగా, జస్టిస్ సంజయ్ కుమార్ “నాట్ బిఫోర్ మి” (నా ముందుకు కాదు) అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఈ కేసును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనానికి బదిలీ చేశారు. డిసెంబర్ 2న జస్టిస్ ఓకా ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఎంపీ రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను కూడా జస్టిస్ ఓకా ధర్మాసనే పరిశీలించనుంది.