అమరావతి: ఆసియా-పసిఫిక్ దేశాల పౌర విమానయాన మంత్రుల సదస్సు ఢిల్లీలో బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి, టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది.
ఆయనను ఆసియా-పసిఫిక్ దేశాల అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సింగపూర్ ఈ ప్రతిపాదనను ముందుకు తేవగా, భూటాన్ దీనిని బలపరిచింది.
ఈ గౌరవాన్ని తనపై ఉంచిన బాధ్యతగా స్వీకరిస్తానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ICAO ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు సభ్యదేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేసి, భద్రతా ప్రమాణాలను పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య విమాన సేవలు 2035 నాటికి 3.5 బిలియన్ ప్రయాణికులతో అతిపెద్ద మార్కెట్‌గా మారుతాయని, ఈ విస్తృత వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దేశాల మధ్య సహకారం అవసరమని రామ్మోహన్ నాయుడు వివరించారు.
భారత విమానయాన రంగం ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో వేగంగా అభివృద్ధి చెందిందని, 2014లో 74 ఎయిర్‌పోర్టులు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య 157కి చేరిందని, 2047 నాటికి ఈ సంఖ్యను 350-400కు పెంచడమే లక్ష్యమని తెలిపారు.
ఉడాన్ పథకం కింద 83 కొత్త ప్రాంతీయ మార్గాలను తెరిచినట్లు చెప్పిన రామ్మోహన్ నాయుడు, ఈ పథకం దేశంలోని సర్వీసులు తక్కువగా ఉన్న ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.