జాతీయం: రచ్చకెక్కిన వైవాహిక జీవితం – ఇద్దరూ అర్జున అవార్డు గ్రహీతలే
వివాదంలో చిక్కుకుపోయిన స్టార్ కపుల్
భార్యాభర్తలు అయిన అంతర్జాతీయ మహిళా బాక్సర్ సావీటీ బురా, భారత కబడ్డీ జట్టు మాజీ ఆటగాడు దీపక్ హుడా మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. వీరిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. సావీటీ తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు పెట్టగా, తనను ఆర్థికంగా మోసం చేశారంటూ హుడా సావీటీ కుటుంబంపై దీపక్ ఫిర్యాదు చేశాడు.
హిసార్ పోలీసులకు సావీటీ ఫిర్యాదు
హర్యానాలోని హిసార్ పోలీస్ స్టేషన్‌లో సావీటీ తన భర్తపై కేసు నమోదు చేయించింది. హుడా తనను వరకట్నం కోసం వేధించాడని, రూ. 1 కోటి నగదు, ఎస్‌యూవీ కారును తేవాలంటూ ఒత్తిడి చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా, బాక్సింగ్‌ను వదిలిపెట్టమని తనపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో పాటు, 2023 అక్టోబర్‌లో జరిగిన గొడవ తర్వాత ఇంటి నుంచి బయటకు పంపేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
హుడా ఆరోపణలు – రోహ్తక్‌లో ఫిర్యాదు
దీనికి ప్రతిగా, హుడా సావీటీ కుటుంబం తన ఆస్తిని ఆక్రమించుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నారంటూ రోహ్తక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తనకు తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చని హుడా పోలీసులకు తెలిపారు.
విడాకుల దిశగా స్టార్ కపుల్
2022 జులై 7న పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకుల దిశగా వెళ్తోంది. వారి వివాహ బంధం తక్కువ సమయంలోనే ఇంత పెద్ద వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఇరుపక్షాల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇద్దరూ అర్జున అవార్డీలే !
దీపక్ హుడా 2020లో అర్జున అవార్డు అందుకోగా, సావీటీ బురా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి ఈ ఏడాది జనవరిలో అర్జున అవార్డు పొందింది. వివాదాస్పద పరిస్థితుల కారణంగా ఈ జంట ఇప్పుడు క్రీడా ప్రపంచంలో కూడా చర్చనీయాంశంగా మారింది.