ఇంటర్నెట్ డెస్క్: వెడ్డింగ్ ఇన్విటేషన్‌ల పేరిట సైబర్ క్రిమినల్స్ వల
మొదట్లో కుటుంబంలో పెళ్లి వేడుకలు ఉంటే స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలను అందించేవారు. ఇప్పుడు డిజిటల్ కాలంలో వాట్సప్ ద్వారా లింకులు పంపడం ట్రెండ్ గా మారింది.
ఇదే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక పేరుతో మోసపూరిత ఫైళ్లను వాట్సప్‌లో పంపిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసుల ప్రకారం, పెళ్లి ఆహ్వాన పత్రికల పేరుతో కొత్త నంబర్ల నుంచి వచ్చే లింకులు, ఫైళ్లపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మోసపూరిత ఫైళ్లతో మోసం:
సైబర్ నేరగాళ్లు వివాహ ఆహ్వాన పత్రికగా ఫైళ్లను పంపి, ఫైల్ లేదా లింక్ క్లిక్ చేస్తే ఏపీకే (APK) ఫైల్ రూపంలో యాప్ డౌన్‌లోడ్ అయి మాల్‌వేర్ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.
ఇది మన ఫోన్ డేటా, గ్యాలరీ, యాప్ అనుమతులను పొందడానికి మాల్‌వేర్ సాధనంగా మారుతుంది. ఇలా మోసపూరితంగా డేటాను సైబర్ నేరస్థుల సర్వర్‌కు చేరుస్తుంది, తద్వారా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించుకునే అవకాశం కల్పిస్తుంది.
‘సైబర్ నేరస్థులు లింకులు పంపించి వాటితో డబ్బులు కాజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫైళ్లు, లింక్‌లు క్లిక్ చేయవద్దు. వాటిని క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. దీంతో యాప్‌లు డేటా మొత్తం నేరగాళ్ల సర్వర్‌కు చేరవేస్తాయి. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఫోన్ డేటా నేరగాళ్ల చేతుల్లోకి వెళుతుంది. కొత్త నంబర్ల నుంచి వచ్చే సందేశం ఏదైనా కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి’- నల్లమోతు శ్రీధర్, సైబర్ నిపుణుడు
జాగ్రత్తలు:
- లింకులు, ఫైళ్లు డౌన్‌లోడ్ చేసేముందు ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలి.
- ఎవరైనా పంపిన మెసేజ్ కచ్చితంగా తనిఖీ చేసి తెరవాలి.
- అనుమానస్పదమైన ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేయవద్దు.