న్యూఢిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తన పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటిస్తూ, ప్రజలు నిజాయితీకి మళ్లీ సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎంగా కొనసాగబోనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఢిల్లీలో ముందస్తు ఎన్నికల డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ఢిల్లీ సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ లోపల ఈ పదవి కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, మంత్రి అతిషి పేరు ఈ రేసులో ముందంజలో ఉంది.
అతిషి –కేజ్రీవాల్ విశ్వాసం
అతిషి, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరొందారు. ముఖ్యంగా మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సమయంలో, పార్టీ కార్యకలాపాలను చక్కగా నిర్వహించిన ఆమెకు పార్టీపై మంచి పట్టుంది. 2020 ఎన్నికల తరువాత గోవా యూనిట్‌కి ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు కలిసొస్తుంది. ప్రస్తుత కేబినెట్‌లో అయిదు శాఖలను పర్యవేక్షిస్తూ, ఢిల్లీ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించారు. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ రాజీనామాతో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇతర వారసత్వ పోటీదారులు
కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో మరో ముగ్గురు అగ్రనేతల పేర్లు కూడా సీఎం పదవికి చర్చలో ఉన్నాయి. కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ వంటి సీనియర్ నాయకులు ఈ రేసులో ఉన్నారు. వీరందరూ కూడా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కైలాష్ గెహ్లాట్
ప్రస్తుతం న్యాయ, రవాణా, ఐటీ, ఆర్థిక శాఖలను పర్యవేక్షిస్తున్న కైలాష్ గెహ్లాట్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పలు కీలక శాఖలను నిర్వహిస్తూ తన సత్తా చాటిన గెహ్లాట్, సీఎం పదవికి ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు.
సౌరభ్ భరద్వాజ్
సౌరభ్ భరద్వాజ్ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్న మరో సీనియర్ నేత. ప్రజారోగ్యం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి వంటి శాఖలను పర్యవేక్షిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
గోపాల్ రాయ్
గోపాల్ రాయ్ కూడా కేజ్రీవాల్ నమ్మకస్తులలో ఒకరు. పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ వంటి శాఖలను నిర్వహిస్తూ తన పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.
ముందస్తు ఎన్నికల డిమాండ్లు
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ఢిల్లీలో ముందస్తు ఎన్నికల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రజలు మరోసారి తమ తీర్పు వెలువరించే వరకు సీఎం కుర్చీలో కూర్చోబోనని కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద సవాలుగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో, ఆప్ పార్టీకి కొత్త నాయకత్వం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. కేజ్రీవాల్ వారసుడిగా ఎవరు గద్దె ఎక్కతారు, ఎవరు పార్టీలో ముందుకు వస్తారు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.