గుంటూరు : కోవిడ్ వ్యాక్సిన్ వికటించి బ్రెయిన్ డెడ్ అయ్యిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే మరణించిందని ఇంకా నిర్ధారణ అవలేదని ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఇవాళ పేర్కొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్ బొక్కా విజయ లక్ష్మి కుటుంబ సభ్యులను మంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, జిల్లా అధికారులు ఇ రోజు పరామర్శించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ శ్రీమతి బొక్కా విజయలక్ష్మి ఆదివారం మరణించింది. ఆమె ఈనెల 19న కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మంత్రి ఆళ్ల నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయలక్ష్మి చనిపోవడం చాలా దురదృష్టం అన్నారు. కాగా ఇంకా పోస్టుమార్టం రిపోర్టు రాలేదని, అది వస్తే గాని ఆమె మరణానికి సంబంధించిన సహేతుక కారణాలు తెలియవన్నారు.
పోస్టుమార్టం రిపోర్టు త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయలక్ష్మి మరణానికి కారణాలు ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కుటుంబ సభ్యులకు వివరించామని తెలిపారు. కుటుంబ సభ్యులు ఒక ఉద్యోగం అడిగారని, అలాగే ఇళ్ల స్థలం, ఇన్సూరెన్స్ కింద వచ్చే యాభై లక్షలు అడిగారని తెలిపారు.
విజయలక్ష్మి మరణానికి 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తించదన్నారు. కరోనా విధులు అందించేటప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, వ్యాక్సినేషన్‌కు వర్తించదని ఆయన తెలిపారు. అయితే సీఎం వైఎస్ జగన్ మానవత్వంతో ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయలు ఇస్తామన్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి 3 లక్షల 88 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇప్పటివరకు లక్షా యాభై వేల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు.