హైదరాబాద్: తెలుగు సినిమా మాటల రచయితల్లో ప్రాస కోసం, డైరెక్షన్ కోసం కాకుండా డైరెక్టర్ వెనక ఉంది కథకి తగినట్టు, కథకి అనుగుణంగా వినగానే గుండెల్ని కదిలించే కొద్ది మంది మాటల రచయితల్లో అబ్బూరి రవి ఒకరు. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన గొప్ప తనం గురించి తనతో జరిగిన సంఘటన ఒకటి చెప్పారు ఈ ‘పంజా’ మాటల రచయిత.
ఆయన మాటల్లో
ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నెప్పి వస్తోంది సర్ అంటే, ఠక్కున లేచి లోపలికి వెళ్పోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు. అప్పటికి నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవలేదు. ఆయన పవర్ స్టార్. 5 రోజుల పరిచయం. గుడుంబా శంకర్ సినిమా కోసం. నాకు తెలీదు ఆ సినిమా లో నా పేరు వేస్తారని. అంత గౌరవం ఇస్తారని.. మనిషి ని మనిషి లా గౌరవించే ఆయన గుణం ఆయన వ్యక్తిత్వం లో ఒక భాగం. ఊరికే పవర్ స్టార్ అయిపోరు. ఆయన దగ్గర అబద్ధం ఆడక్కల్లేదు. చప్పట్లు కొట్టక్కల్లేదు. పొగడక్కల్లేదు. మనం మనలా ఉండచ్చు.
అన్నవరం టైం లో ఆయనకిచ్చిన నా 1983 చందమామ కధల బౌండ్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, పంజా సినిమా రాయడానికి ముందు ఒక అసిస్టెంట్ తో పంపించి, అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. “పుస్తకం విలువ తెల్సిన మనిషి కి జీవితం విలువ ఖచ్చితం గా తెలుస్తుంది.” బాధ వస్తే అమ్మ ఒడి ని వెతుక్కునే పసిపిల్లాడు. మంచితనం చూస్తే పరవశం. ఆడపిల్లకి అవమానం జరిగితే ఆవేశం. లేనితనం చూస్తే కంట్లో నీళ్లు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఈ లక్షణాలు అప్పటికప్పుడు రావు. బై బర్త్ కూడా కాదు బిఫోర్ బర్త్ నించి ఉండాలి. అంతే.. ఆయన వ్యక్తిత్వం నామాటల్లో చెప్పాలని పంజా సినిమా లో ప్రయత్నించాను. అప్పుడు పుట్టిన మాటలే ” సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో , సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు “.